జీవితంలో శత్రువులతో బాధపడేవారు, ప్రజల బెదిరింపులు మరియు భయాందోళనలు ఎదుర్కొంటున్నవారు ఈ కాల భైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించాలి.
Kalabhairava Ashtakam Telugu Lyrics ను అర్థం తో సహితంగా చదివి ఆ కాలభైరవుని అనుగ్రహాన్ని పొందండి
కాలభైరవాష్టకం అనేది శ్రీమద్ శంకరాచార్యులు రచించిన ఒక శ్లోకం. దాని ప్రవాహం శివ తాండవం లాంటిది. కాళికా పురాణం ప్రకారం, భైరవుడు శివుని అనుచరులలో ఒకడు. అతని వాహనం కుక్క.
భైరవుని మూలం: –
శివ మహాపురాణం ప్రకారం, భైరవుడు మార్గశీర్ష మాసంలోని కృష్ణ అర్ధభాగంలో ఎనిమిదవ రోజు మధ్యాహ్నం జన్మించాడు. ఈ తేదీని కాలభైరవ అష్టమి అని పిలుస్తారు. గ్రంథాలలో అనేక ఇతిహాసాలు కనిపిస్తాయి. అంధకాసురుడు అనే రాక్షసుడు తన అహంకారంతో శివునిపై దాడి చేశాడని, అప్పుడు భైరవుడు శివుని రక్తం నుండి జన్మించాడని చెబుతారు.
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే || 1
అర్థం : దేవతలకు రాజు అయిన ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు జీవరాసుల మీద కృపను చూపేవాడు . నారుదుడు మరియు యోగుల చేత స్తుతించ బడే వాడు (ఆరాధించబడే ).
దిగంబరుడు మరియు కాశీ క్షేత్రం యొక్క పాలకుడు అయిన ఆ కాలభైరవుడికి నమస్కారం.
భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం |
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే || 2
అర్థం : కోటి సూర్యుల వలె తేజస్సు కలవాడు , అస్తిత్వ సాగరం నుండి రక్షించే దేవుడు, నీలం రంగు కలిగినవాడు , ప్రాపంచిక సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు మరియు మూడు కళ్ళు కలవాడు. త్రిశూలము మూడు లోకములను కలిగియున్న మరియు నాశనము లేని కాశీకి అధిపతి అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను.
శూలాటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే || 3
అర్థం : అతని శరీరం నల్లగా ఉంటుంది (హాలాహలాన్ని ) మరియు అతను తన చేతుల్లో ఈటె, టంకా, పాశదండాన్ని (ఒకరకమయిన ఆయుధం) పట్టుకుంటాడు . ఆది దేవుడు, నాశనం లేనివాడు , అతను గొప్ప పరాక్రమవంతుడు.
నేను కాశీ నగర అధిష్టాన దేవత, సర్వశక్తిమంతుడు , తాండవ నృత్యం చేసే కాలభైరవుడిని పూజిస్తాను
భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం.
భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహమ్ |
నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీ ల సత్కటిం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే || 4
అర్థం : భక్తి ని కలిగించేవాడు , ముక్తిని ప్రసాదించేవాడు , గొప్ప సుందరమయిన రూపం కలవాడు .ఆ దృఢమయిన రూపం తో సమస్త లోకాలను నియంత్రించేవాడు .మనోజ్ఞమయిన బంగారు పట్టి లతో , ఆభరణాలతో అలకరించుకొన్నవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుమ్ |
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే|| 5
అర్థం : ధర్మ మార్గాన్ని రక్షించేవాడు, అధర్మాన్ని నాశనం చేసేవాడు, కర్మ బంధనాల నుండి విముక్తి కలిగించేవాడు,కేశపాశాలనుఁ తల మీద కలిగి ఉన్న సర్వవ్యాప్తి చెందేవాడు..
కాశీ నగరానికి అధిష్టాన దేవత అయిన కాలభైరవుడిని నేను పూజిస్తాను.
రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ |
మృత్యు దర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6
అర్థం : రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు. నిత్యం అద్వితీయ మయిన ఇష్ట దేవుడు గా ఉండే వాడు. మచ్చలేనివాడు. మృత్యు దేవత గర్వాన్ని నశింపజేసే వాడు (అంటే అకాల మృత్యువు నుండి కాపాడే వాడు అని అర్థం ). ఆ దేవత భయంకరమైన కోరల నుండి, విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నా హృదయపూర్వక నమస్కారం.
అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిమ్
దృష్టి పాత నష్ట పాప జాలముగ్ర శాసనమ్ |
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం’
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7
అర్థం : బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో చీల్చి చెండాడే ప్రళయకారకుడు. తన కనుచూపు తో పాపాలను నశింప చేసేవాడు. కఠినంగా క్రమ శిక్షణ అమలుచేసేవాడు (లోకాలను క్రమశిక్షణతో నియంత్రించేవాడు ఆ పరమేశ్వరుడు ). అణిమ, మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను ఇచ్చేవాడు (తనను భక్తి తో కొలిచేవారికి అని అర్థం ). పుర్రెల ను దండ గా ధరించే వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ |
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే || 8
అర్థం : లోకమంతా కీర్తి కలిగినవాడు సకల భూతాలకు నాయకుడు , లోక రక్షకుడు.కాశీ మహాక్షేత్రం లో నివసించే సకల ప్రాణుల పాపలను శుద్ధి చేస్తూ పుణ్య ఫలాన్ని అందించేవాడు.నీతి మార్గాన్ని సూచించేవాడు , జగత్తు లోనే గొప్ప పండితుడు ప్రాచీనుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
ఫలశ్రుతి :
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం.
జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ |
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ || 9
అర్థం : ఎవరయితే ఈ అందమైన ‘కాల భైరవాష్టకం’ పఠిస్తారో వారు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో ఆశీర్వదించబడతారు. ఇది జ్ఞానం మరియు ముక్తిని పొందే సాధనం, ఇది భక్తుల యొక్క విశిష్ట ధర్మాలను పెంచుతుంది. దుఃఖం మరియు కోపాన్ని నాశనం చేస్తుంది ఎవరైతే దీనిని ప్రతిదినం చదువుతారోవారు కాల భైరవుని పాదాల వద్దకు చెరబడతారు అంటే కాల భైరవుని అనుగ్రహం పొందుతారు.ఇది తథ్యం
పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం
శ్రీ కాలభైరవ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం లోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఉంది.
కాశీ-క్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఇదే అని అభిప్రాయం . కార్తిక బహులాష్టమిలో శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు మరియు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడికి దగ్గరలో కామారెడ్డి లో ట్రైన్ సౌకర్యం కలదు.
కామారెడ్డి నుండి 15 కిమీ మరియు నిజామాబాదు నుండి 54 కిమీ ఉంటుంది . ఇది జాతీయరహదారి NH 44 కు అతి దగ్గరలో ఉంటుంది.
ఇంకా ఇది కూడ చదవండి : హనుమాన్ చాలీసా -అర్థం తో